గౌతమీనగర్‌లో రోడ్డు పనుల మధ్య విషాదం.. జారిపడి వ్య‌క్తి మృతి

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గౌతమీనగర్ కాలనీలో జరుగుతున్న రోడ్డు పనులు విషాదానికి దారితీశాయి. రోడ్డు పనుల కోసం వేసిన కంకర కలిపిన మెటీరియల్‌పై జారిపడి ఒంగోలుకు చెందిన శ్రీనివాసరావు (50) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు. శ్రీనివాసరావు మృతితో కుటుంబ సభ్యులు, కాలనీవాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చందానగర్ పోలీస్ స్టేషన్ నుంచి బిచ్చారెడ్డి స్వీట్ హౌస్ వరకు గౌతమీనగర్ కాలనీలో ఏడు రహదారులు ఉన్నాయని, గతంలో ఈ రోడ్లలో డ్రైనేజీ సమస్య పెద్దగా లేదని భాస్కరరెడ్డి పేర్కొన్నారు. అయితే రాజకీయ వివక్ష కారణంగా కొన్ని రోడ్ల పనులు మాత్రమే చేపట్టి, మరికొన్ని రోడ్లను సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా పనులకు ఫౌండేషన్ వేసి, అనంతరం రోడ్లను తవ్వి పనులు పూర్తి చేయకుండా జాప్యం చేయడం వల్ల స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. ఒక రోడ్డుపై కంకర కలిపిన నిర్మాణ సామగ్రిని కుప్పలుగా ఉంచడంతో శ్రీనివాసరావు నడుస్తూ జారిపడి తలకు తీవ్ర గాయమై స్పృహ కోల్పోయారని తెలిపారు. కాలనీవాసులు 108కు సమాచారం అందించడంతో ఆయనను కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారని, అయితే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు భాస్కరరెడ్డి తెలిపారు.

ఈ ఘటనకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌లో ఎవరి నిర్లక్ష్యం కారణమో తేల్చాలని భాస్కరరెడ్డి డిమాండ్ చేశారు. పనులను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసిన ప్రజాప్రతినిధులా, పనులపై తగిన పర్యవేక్షణ చేయని అధికారులా, నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టరా అని బాధ్యులని ప్రశ్నించారు. అలాగే సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో, పనులను వేగవంతం చేయించడంలో కాలనీ అసోసియేషన్, కాలనీవాసుల పాత్రపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. తమ సమస్యలను జనం కోసం సంస్థ ద్వారా జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా, సంబంధిత అధికారులకు నోటీసులు వచ్చినా పనుల్లో జాప్యం కొనసాగిందని భాస్కరరెడ్డి ఆరోపించారు. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, మియాపూర్ డిప్యూటీ కమిషనర్‌ల బాధ్యతపైనా ఆయన ప్రశ్నలు సంధించారు.

శ్రీనివాసరావు మృతిని సాధారణ ప్రమాదంగా చూడకుండా, పనుల్లో నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని భాస్కరరెడ్డి డిమాండ్ చేశారు. ఇది క‌చ్చితంగా హత్యే.. హంతకులు ఎవరో తేల్చాలి. బాధ్యులు సమాధానం చెప్పాలి అని ఆయన అన్నారు. రోడ్డు పనుల భద్రతా ప్రమాణాలు, పనుల పర్యవేక్షణ, నిర్మాణ సామగ్రి నిల్వ విధానంపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి, శ్రీనివాసరావు మృతికి దారితీసిన పరిస్థితులను వెలుగులోకి తీసుకురావాలని జనం కోసం డిమాండ్ చేసింది. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు లేదా కాంట్రాక్టర్ నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here