శేరిలింగంపల్లి, ఆగస్టు 23 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్‌నగర్‌లోని మిత్రహిల్స్ కాలనీలో హెచ్‌ఎమ్‌డీఏకు చెందిన 2వేల గజాల స్థలాన్ని వేలం వేయడాన్ని నిరసిస్తూ కాలనీవాసులు, స్థానిక నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ స్థలంలో వేలం ప్రక్రియను తక్షణమే నిలిపివేసి స్థానిక ప్రజలు, పిల్లల కోసం పార్కును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ధర్నాలో నాయకులు, కాలనీవాసులు పార్కు కోసం కేటాయించిన స్థలంలో పడుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్థలాన్ని వేలం వేయాలన్న హెచ్‌ఎమ్‌డీఏ అధికారుల నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తమను అక్కడ బొంద పెట్టాకే ఈ స్థలాన్ని వేలం వేయాలి అంటూ నినాదాలు చేశారు.

నాయకులు మాట్లాడుతూ.. సర్వే నంబర్ 65లోని 1 ఎకరం 27 గుంటల భూమిని 2002లో అప్పటి హుడా (ప్రస్తుత HMDA) పార్కు, ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసిందని తెలిపారు. అయితే కాలక్రమేణా ఎకరానికి పైగా భూమి ఆక్రమణలకు గురై నిర్మాణాలతో నిండిపోయిందని ఆరోపించారు. మిగిలిన 2వేల గజాల స్థలాన్ని కూడా వేలం వేయడానికి ప్రభుత్వం సిద్ధపడటం దారుణమని వారు మండిపడ్డారు. ఇప్పటికే కాంక్రీట్ జంగల్‌గా మారిన ప్రాంతంలో మిగిలిన స్థలాన్నైనా ప్రజల అవసరాలకు వినియోగించాలని కోరారు. వెంటనే HMDA వేలం ప్రక్రియను రద్దు చేసి, మిగిలిన స్థలంలో పిల్లల ఆటపాటలకు, కాలనీవాసుల ఆహ్లాదానికి ఉపయోగపడేలా పార్కును అభివృద్ధి చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రజల డిమాండ్‌ను పట్టించుకోకుండా వేలం ప్రక్రియను కొనసాగిస్తే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ధర్నాలో మిత్రహిల్స్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, రవీందర్ రావు, సీతారామరాజు, అరుణ్ కుమార్, సునీల్ రెడ్డి, బాలు యాదవ్, కృష్ణ, బాలాజీ, శ్రీనివాస్, అంబాదాస్, నాగరాజ్, సిద్ధి నరేష్, రవి నాయక్, గణేష్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, పద్మ, గోపాల్ రావు, వెంకట స్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





