నమస్తే శేరిలింగంపల్లి: గణేష్ పండుగ దృష్ట్యా, వర్షాల కారణంగా ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించాలని, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ట్రాఫిక్ సమస్యలపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, కూకట్‌పల్లి, శంషాబాద్, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీలు, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనరేట్ లోని ట్రాఫిక్ సమస్యలకు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో తలెత్తే అత్యవసర ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు భద్రత వంటి అంశాలను ముందస్తుగా ఊహించి అందుకనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని సీపీ సూచించారు. ఐటీ, ఐటీఎస్ కంపెనీలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సాఫీగా ఉండేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సిబ్బంది వినూత్న విధానాలను అవలంబించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీసీపీ శంకర్ నాయక్, బాలానగర్ ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాస్ రెడ్డి, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్, కూకట్‌పల్లి ఏసీపీ హనుమంత రావు, ఏసీపీ సంతోష్ కుమార్, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.