శేరిలింగంపల్లి, నవంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ డబుల్ రోడ్డు నుంచి న్యూ ప్రశాంత్ నగర్ కాలనీ వరకు నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన CMC అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి నాణ్యతా లోపాలకు తావులేకుండా దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా పనులు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ప్రశాంత్ నగర్ డబుల్ రోడ్డు నుంచి న్యూ ప్రశాంత్ నగర్ కాలనీ వరకు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే స్థానికుల రాకపోకలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలు, కాలనీవాసుల సూచనలు, సమస్యలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో CMC అధికారులు ఏఈ నిఖిల్, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్, ప్రశాంత్ నగర్ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు రవి, నర్సింహులు, రాజు, కాలనీవాసులు, స్థానికులు పాల్గొన్నారు.





