శేరిలింగంపల్లి, నవంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): 2030 నాటికి భారతదేశాన్ని బాల్య వివాహాలు లేని దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో స్పందన కల్చరల్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ (స్కోప్) సంస్థ మూడు జిల్లాల్లో భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. బాల్య, ప్రారంభ, బలవంతపు వివాహాల నిర్మూలన కోసం తొలి అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా 36 అవగాహన, ప్రతిజ్ఞా కార్యక్రమాలతో పాటు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 6,500 మంది పాల్గొని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాల నుంచి రక్షించబడిన బాలికలు, వాటిని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించిన మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు. పురోహితులు, మౌల్వీలు, మిఠాయిల తయారీదారులు, వంటవారు, డెకరేటర్లు, బ్యాండ్ నిర్వాహకులు, టెంట్ సర్వీస్ నిర్వాహకులు, ప్రింటింగ్ ప్రెస్ యజమానులు సైతం బాల్య వివాహాలకు సహకరించబోమని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమాల్లో అడిషనల్ జిల్లా కలెక్టర్ భాస్కర్ రావు, లీగల్ సెల్ అడ్వైజర్ మంచాల రవీందర్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ జయశ్రీ, డీఆర్డీఓ డైరెక్టర్ నాగిరెడ్డి, డీడబ్ల్యూఓ శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, డీపీఓ శ్రీనివాస్, మిషన్ శక్తి హేమలత, కేజీబీవీ సీఈఓ సుజాత, ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు. స్కోప్ అధ్యక్షుడు డాక్టర్ బండి సాయన్న మాట్లాడుతూ, గత మూడేళ్లుగా ప్రభుత్వం, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ (జేఆర్సీ) సంస్థతో కలిసి బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తున్నామని తెలిపారు. సమిష్టి కృషితో జిల్లాలను బాల్య వివాహాలు లేని జిల్లాలుగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.

జేఆర్సీ జాతీయ సమన్వయకర్త రవికాంత్ మాట్లాడుతూ, 2026 సెప్టెంబర్ 4న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నవంబర్ 27ను బాల్య, ప్రారంభ, బలవంతపు వివాహాల నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటిస్తూ తీర్మానం ఆమోదించిందన్నారు. జేఆర్సీ వ్యవస్థాపకుడు భువన్ రిభు కృషి ఈ అంతర్జాతీయ గుర్తింపులో కీలకమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జేఆర్సీకి చెందిన 300కు పైగా భాగస్వామ్య సంస్థలు 782 జిల్లాల్లో పనిచేస్తుండగా, గత మూడేళ్లలో 6.5 లక్షలకు పైగా బాల్య వివాహాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. స్కోప్ సంస్థ 2024-25లో స్థానిక జిల్లా యంత్రాంగం సహకారంతో 1,648 బాల్య వివాహాలను అడ్డుకుంది. 2030 నాటికి బాల్య వివాహాలు లేని భారతదేశాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు పునరుద్ఘాటించారు.





