శేరిలింగంపల్లి, నవంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన సర్వే చేపట్టి బడుగు బలహీన వర్గాలు సామాజిక, రాజకీయ, ఉద్యోగాల్లో ఎదగాలనే ఆకాంక్షతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక,ఆర్ధిక,విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలను తానే స్వయంగా నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నదని, సమగ్ర ఇంటింటి సర్వే సందర్భంగా సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని, సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్లకు సరైన సమాచారాన్ని ఇచ్చి సహకరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే సర్వేకు ప్రభుత్వం రూపొందించిన సుమారు 75 కాలమ్‌లలో వివరాల సేకరణ చేపట్టడం జరుగుతుందని, సర్వే ఫారంలో ఎన్యుమరేటర్లు ఎట్టి పరిస్థితులలో తప్పులు నింపవద్దని, ఏవైనా సందేహాలు ఉంటే జిహెచ్ఎంసీ అధికారులు లేదా కమిషనర్ ను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు.