జ‌ర్న‌లిస్టును ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డి బెదిరించిన కేసు హైకోర్టులో విచార‌ణ.. సోమ‌వారానికి వాయిదా..

ప‌టాన్‌చెరు (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): త‌న‌ను చంపుతాన‌ని బెదిరింపుల‌కు గురి చేసిన ప‌టాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విలేక‌రి సంతోష్ నాయ‌క్ కోర్టులో రిట్ పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. కాగా ఆ పిటిష‌న్‌ను శుక్ర‌వారం హైకోర్టు విచారించింది. ప‌టాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డికి చెందిన అనుచ‌రులు 45వ నంబ‌రు జాతీయ ర‌హ‌దారితోపాటు బీరంగూడ నుంచి కిష్టారెడ్డి పేట వెళ్లే ర‌హ‌దారి ప‌క్కన ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను ఆక్ర‌మించి షెడ్ల‌ను నిర్మించార‌ని సంతోష్ నాయ‌క్ ఇటీవ‌ల క‌థ‌నాన్ని రాశాడు. కాగా ఆ క‌థ‌నం నేప‌థ్యంలో ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డి సంతోష్ నాయ‌క్ ను చంపుతాన‌ని బెదిరించాడు. దీంతో ఎమ్మెల్యేపై సంతోష్ నాయ‌క్ స్థానిక ప‌టాన్‌చెరు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు.

జ‌ర్న‌లిస్టు సంతోష్ నాయ‌క్

అయితే పోలీసులు నామ మాత్రంగా కేసు న‌మోదు చేశార‌ని, ఎమ్మెల్యేపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని బాధితుడు కోర్టులో వేసిన పిటిష‌న్‌లో పేర్కొన్నాడు. ఈ మేర‌కు బాధితుడి త‌ర‌ఫు న్యాయ‌వాది ఉమేష్ చంద‌ర్ కోర్టుకు ఇదే విష‌యాన్ని వివ‌రించారు. ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్ట్ చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఫోర్త్‌ ఎస్టేట్ లో భాగంగా ఉన్న ఒక జర్నలిస్టును చంపుతాన‌ని బెదిరించడం, దూషించడం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని ఆయ‌న‌ కోర్టుకు తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధిగా ఉండి ఈ విధంగా వ్యవహరించిన ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని న్యాయ‌వాది ఉమేష్ చంద‌ర్ కోర్టును కోరారు.

ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డి

ఈ కేసులో ఆర్టికల్ 226 కు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లను ఉమేష్ చంద్ర ప్ర‌స్తావించారు. కేసు పూర్వాపరాలను ఆయ‌న స‌మ‌ర్పిస్తామ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో ఇరు ప‌క్షాల‌ వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here