కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించటమే ప్రధాన ధ్యేయంగా పని చేస్తున్నామని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ పోచమ్మ గుడి వెనుక వీధిలో రూ.25 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అంతర్గత రోడ్ల పనులను శుక్రవారం అర్ధరాత్రి కార్పొరేటర్ హమీద్ పటేల్ పర్యవేక్షించారు.

ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ బస్తీలలో, కాలనీలలో ప్రధానంగా, అత్యవసరంగా కావాల్సిన అభివృద్ధి పనులపై దృష్టి పెట్టి త్వరితి గతిన సమస్యల పరిష్కారం చేస్తున్నామని అన్నారు. ప్రజలు కోరుకునే విధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేసి పనులను చేయిస్తున్నట్టు పేర్కొన్నారు. మంచినీరు, డ్రైనేజీ, శానిటేషన్, విద్యుత్, రోడ్లు, వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కరీం, అస్లాం, రియాజ్, శేఖర్, అహ్మద్ పాల్గొన్నారు.