నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ స్థలాల అన్యాక్రాంతాన్ని అడ్డుకోవాలని కోరుతూ బిజెపి నాయకులు కూకట్ పల్లి తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. బిజెపి సీనియర్ నాయకులు వెలగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హైదర్ నగర్ డివిజన్ నిజాంపేట్ రోడ్డు హర్ష టొయోట సమీపంలోని సర్వే నంబర్ 123లో గల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని ఎంఆర్ఓ గోవర్ధన్ కు ఫిర్యాదు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన 2016 -17 పహాణి ప్రకారం సదరు సర్వే నెంబర్ లో ఖారీజు ఖాతా కింద 4 ఎకరాల 5 గుంటల ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేలిందని, ఆ భూమిని గుర్తించి కబ్జాదారుల నుండి కాపాడాలన్నారు. తహసీల్దార్ స్పందిస్తూ అక్కడ భూమిని సర్వే చేయించి కబ్జా చేస్తున్న వారికి నోటీసులు ఇవ్వాలని రెవెన్యూ ఇన్స్ పెక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ మాధవరం కాంతారావు, డివిజన్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, వేణు యాదవ్, శేషయ్య, కృష్ణంరాజు, కరుణాకర్, బాషా, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.