- ప్రతిరోజు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమంతో పాటు అన్నదానం
- సామాజిక భాద్యతను వివరించే కరపత్రాలతో భక్తులకు అవగాహన
నమస్తే శేరిలింగంపల్లి: స్వాతంత్రోద్యమ సమయంలో జాతిని ఐక్యం చేసేందుకు ఇంట్లోని వినాయకుడిని వీధిలోకి తీసుకువచ్చి సామూహిక ఉత్సవాలకు తెరలేపారు బాల గంగాధర్ తిలక్. ఐతే కాలక్రమంలో అవగాహన కోల్పోయి ఉత్సవాలను అపహాస్యం చేస్తు వచ్చారు కొందరు. మండపాల వద్ద సినిమా పాటలు, అశ్లీల నృత్యాలతో తిలక్ ఆలోచనలకు పూర్తి భిన్నంగా ఉత్సవాలను మార్చేసి హిందుత్వానికి మాయని మచ్చని తెచ్చిపెట్టారు. ఐతే ఇటీవలి కాలంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో తిరిగి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యువత సైతం సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తూ పూర్తి నిష్టా భక్తితో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాంటి వారికి హఫీజ్‌పేట్‌లోని హనుమాన్ యూత్ వినాయక ఉత్సవాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
హఫీజ్‌పేట్ హనుమాన్ యూత్ వినాయక మండపంలో విగ్రహ ప్రతిష్టాపన మొదలు నిమర్జనం వరకు ప్రతీరోజు ఒక ప్రత్యేక సామూహిక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొదటిరోజు నుంచి వరుసగా మంత్ర పుష్ఫం, కుంకుమార్చన, గణపతి హోమం, రుద్రాభిషేకం, ఆంజనేయ అభిషేకం, గణపతి అభిషేకం, సహస్త్ర నామార్చన, అడపడుచులకు పసుపుబొట్టు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, గోమాత పూజలతో పాటు నిత్యాన్నదానం నిర్వహహిస్తున్నారు. అదేవిధంగా పూజలకు వచ్చే భక్తులకు సామాజిక భాద్యత పట్ల అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్ఛభారత్‌లో భాగస్వాములు కావాలని, చెత్తను రోడ్లపై వేయకుండా, తడిపొడి చెత్త వేర్వేరుగా చేసి స్వచ్ఛ రిక్షాలోనే వేయాలని, ప్రతి ఇంట్లో మనిషికి ఒకటి చొప్పున మొక్క నాటాలని, గ్రామంలో ప్లాస్టిక్ క్యారీబ్యాగ్‌ల వినియోగాన్ని అదేవిధంగా గుట్క, సిగరేట్, మద్యాన్ని నిషేదించాలని, స్వదేశీ ఉత్పత్తులనే వాడుతూ దేశ ఆర్ధికాభివృద్ధిలో భాగస్వాములు కావాలి లాంటి అంశాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇతర మండపాల నిర్వాహకులు హఫీజ్‌పేట్ హనుమాన్ యూత్‌ను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.