తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం

  • తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రెటరీ (ఎంఏ అండ్ యూడీ) అరవింద్ కుమార్
  • క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసికోల్లాసం : సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్
  • ఘనంగా ప్రారంభమైన సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ –2021
  • ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రెటరీ (ఎంఏ అండ్ యూడీ) అరవింద్ కుమార్
  • గౌరవ అతిథిగా హాజరైన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి కుమారి నైనా జైస్వాల్

సైబరాబాద్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2021 కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రామాన్ని తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రెటరీ (ఎంఏ అండ్ యూడీ) అరవింద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉంటే ప్రజారక్షణకు పోలీసులు రోడ్లపై 24 * 7 అంకితభావంతో కష్టపడి పని చేశారన్నారు. తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శమన్నారు. అలాగే లాక్ డౌన్ లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో అనేక రోడ్డు పనులు పూర్తు చేశామన్నారు. రెండు నెలల కాలంలోనే అనేక రోడ్డు పనులు పూర్తి చేసేందుకు సహకరించిన సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ఎమ్ విజయ్ కుమార్ ను అభినందించారు.

స్పోర్ట్స్ మీట్‌లో క్రీడాకారుల‌ను ప‌రిచ‌యం చేస్తున్న సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్‌, చిత్రంలో అరవింద్ కుమార్, నైనా జైస్వాల్

పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి క్రీడలు తోడ్పడతాయన్నారు. పోలీసులు శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. పోలీసుల మానసికోల్లాసం కోసం స్పోర్ట్స్ మీట్ ను ఏర్పాట చేయడం పట్ల సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ని అభినందించారు. ఇలాంటి స్పోర్ట్స్ మీట్ ను ప్రతి సంవత్సరం జరపాలన్నారు. ఆటల్లో గెలుపోటములనేవి సహజమన్నారు. గెలుపోటముల కంటే టీమ్ స్పిరిట్ గొప్పదన్నారు. క్రీడలు మనలో దాగున్న శక్తి సామర్థ్యాలను, పోరాట పటిమను వెలికి తీస్తాయన్నారు. పోలీసులు ఇదే స్ఫూర్తిని ప్రొఫెషన్ లోనూ చూపించాలన్నారు.

స్పోర్ట్స్ మీట్‌లో గౌర‌వ వంద‌నం స్వీక‌రిస్తున్న అరవింద్ కుమార్, నైనా జైస్వాల్, సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్

అనంతరం అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి కుమారి నైనా జైస్వాల్ మాట్లాడుతూ.. పరిమిత పరిస్థితులు, మానవ వనరులతో కార్యక్రమాలు నిర్వహించడం కష్టతరమైన పని అన్నారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఒత్తిడి, అలసటకు లోనవుతారు. అయితే సిబ్బంది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచడానికి ఇటువంటి స్పోర్ట్స్ మీట్ లు దోహదపడతాయన్నారు. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అబద్ధాలను మాట్లాడితే పేరును కోల్పోతారు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకంగా జీవిస్తారన్నారు. ఇటువంటి నీతివంతమైన సిద్ధాంతాలతో సైబరాబాద్ పోలీసులు ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారన్నారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న అరవింద్ కుమార్

మ‌హిళల భద్రత కు షీ షటిల్ బస్సులు, సిసిటివిలు, భద్రత చిట్కాలు, పాస్‌పోర్ట్ ధృవీకరణ వంటి సేవలు అందిస్తూ ప్రజలందరి అభినందనలు చూరగొన్న సైబరాబాద్ పోలీసులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. క్రీడల్లో గెలుపు కంటే పాల్గొనడం ముఖ్యమన్నారు. కష్టపడితేనే క్రీడల్లోనైనా, ఏ వృత్తిలోనైనా ఫలితం ఉంటుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు శాల్యూట్ అన్నారు.

నైనా జైస్వాల్‌తో టేబుల్ టెన్నిస్ ఆడుతున్న సీపీ స‌జ్జ‌నార్

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. సైబరాబాద్ లో యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఏర్పాటు చేయడం ఇది వరుసగా మూడవ సారన్నారు. యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2021 ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ (ఎంఏ అండ్ యూడీ) అరవింద్ కుమార్ కి, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి కుమారి నైనా జైస్వాల్, ఇతర అధికారులకు పేరుపేరునా అభినందనలు తెలిపారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో నాలుగు రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో.. బాలానగర్ జోన్, మాదాపూర్ జోన్, శంషాబాద్ జోన్, క్రైమ్స్ వింగ్, ట్రాఫిక్ వింగ్, హెడ్ క్వార్టర్ వింగ్, మినిస్టీరియల్ స్టాఫ్ కు చెందిన 8 టీమ్ లు.. అథ్లెటిక్స్ తోపాటు 15 రకాల క్రీడల్లో 500 మంది సిబ్బంది పాల్గొంటారన్నారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందన్నారు. పోలీసులు వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు. క్రీడలు మనలోని నాయకత్వ లక్షణాలను తట్టి లేపడంతోపాటు టీమ్ స్పిరిట్, ఐకమత్యాన్ని పెంచుతాయన్నారు. క్రీడల్లో పాల్గొనే వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. క్రీడలు మానసిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. క్రీడల్లో పథకాలు సాధించడం కంటే కూడా మంచి స్నేహితులను సాధించడం గొప్ప అన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిపి ట్రాఫిక్ ఎస్ఎమ్ విజయ్ కుమార్, వుమెన్ అండ్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ సెల్ డిసిపి అనసూయ, బాలనగర్ డిసిపి పద్మజ‌, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, ఏడీసీపీ ట్రాఫిక్ ప్రవీణ్ కుమార్, సీఎస్ డబ్ల్యూ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఏసీపీ లు, సెక్షన్ ఆఫీసర్లు, ఇన్ స్పెక్టర్లు, ఆర్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here