నమస్తే శేరిలింగంపల్లి: హర్యాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ శేరిలింగంపల్లిలోని తారానగర్‌లో ఆదివారం సందడి చేశారు. తారానగర్‌లోని ఆర్యవైశ్య ప్రముఖులు చిన్నం సత్యనారాయణ నివాసంలో కొంతసేపు గడిపారు. వారి కుటుంబ సభ్యులతో కలసి మధ్యాహ్న భోజనం ఆరగించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బిజెపిని విస్తరించడంలో కృషిచేసిన మొదటి తరం నాయకుడు దివంగత చిన్నం నర్సింహులు బండారు దత్తాత్రేయకు అత్యంత ఆప్తుడు. గతంలో సికింద్రబాద్ పార్లమెంట్ నుంచి పలుమార్లు ఎంపిగా ప్రాతినిధ్యం వహించిన బండారు దత్తాత్రేయకు తారానగర్‌లోని బిజెపి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు ఇక్కడి నేతలతో ఆత్మీయంగా సమావేశం అవుతుంటారు.
చిన్నం నర్సింహులు అనారోగ్యంతో మృతిచెందగా బండారు దత్తాత్రేయ స్వయంగా రాలేని పరిస్థితిలో అప్పట్లో వారి కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించారు. ఐతే ఆదివారం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శేరిలింగంపల్లికి విచ్చేసిన బండారు దత్తాత్రేయ వారి నివాసానికి విచ్చేశారు. చిన్నం నర్సింహులు కుమారులు చిన్నం సత్యనారాయణ, చిన్నం రామకృష్ణలతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో కలసి మధ్యాహ్న భోజనం ఆరగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు, చిన్నం కుటుంబ సభ్యులు, వారి బంధువులు, స్నేహితులు గవర్నర్‌ను కలిశారు.