- చందానగర్‌లో ఉత్సాహంగా తెలంగాణ కాప్స్ రాక్స్ ఆత్మీయ సమ్మేళనం
నమస్తే శేరిలింగంపల్లి: రాజకీయం పూర్తిగా డబ్బుతో ముడిపడిపోయిందని, రాజకీయాల్లో రాణించాలనుకునే వారు మొదట ఆర్ధికంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ ఎమ్మల్సీ రాంచంద్రయ్య అన్నారు. చందానగర్‌లోని ఎస్ఎన్ రెడ్డి గార్డెన్స్‌లో తెలంగాణ కాప్స్ రాక్స్ ఆద్వర్యంలో కాపు కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాప్స్ రాక్స్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో కాపులు చేస్తున్న అభివృద్ధి, వ్యాపారాలు, సేవా కార్యక్రమలకు సంబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. పలు సాంస్కృతిక ప్రదర్శనలు సభీకులను ఆకట్టుకున్నాయి.
రూ.7వేలతో నామినేషన్ వేశా… కాపు సమాజం అండగ నిలిచింది: ఎమ్మెల్సీ రాంచంద్రయ్య
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాంచంద్రయ్య మాట్లాడుతూ రాజ్యాధికారం అంత సులువైన విషయం కాదని అన్నారు. ఖలేజా ఉన్నవాడు, సేవ తత్పరత కలిగిన వారిని ప్రోత్సహిస్తే మంచి నాయకుడిగా ఎదుగుతారని అన్నారు. తనను ఎన్‌టీ రామారావు రాజకీయాల్లోకి తీసుకువచ్చాడని, తను మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీచేసే క్రమంలో రూ.7 వేలతో నామినేషన్ వేశానని, కాపు సమాజం తనను ప్రోత్సహించి రాజకీయంగా నిలబెట్టిందని గుర్తుచేశారు. కాపు కులస్థులు మొదట వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలని, ఆ తర్వాత కమ్యూనిటి ఎదుగుదలకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాపు సమాజంలో ఎవరైనా ఏ రంగంలో ఐనా రాణిస్తున్నప్పుడు వారిపై ఈర్ష ద్వేషాలు మాని ప్రోత్సహించినప్పుడు కాపుల భవిష్యత్తు బాగుంటుందని హితవు పలికారు.
కాపులకు 5 ఎకరాల భూమికి ప్రభుత్వ హామీ: మిరియాల రాఘవరావు
అధికార భాషా సలహాసంఘం సభ్యులు మిరియాల రాఘవరావు మాట్లాడుతూ కాప్స్ రాక్స్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం చాల అభినందనీయమని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాప్స్‌రాక్స్ సభ్యులందరం ఒకచోట చేరడం సంతోషంగా ఉందని అన్నారు. గత అసెంబ్లి ఎన్నికల్లో నగరంలోని కొందరు ఎమ్మెల్యేల గెలుపులో కాపుల సహాకారం మరిచిపోలేనిదని, స్వయంగా కేటీఆర్ గుర్తించడం కాపు సమాజానికి గర్వకారణమని, ఈ క్రమంలోనే కాపు సమాజం కోసం ప్రభుత్వం 5 ఏకరాల స్థలం ఇచ్చేందుకు హామీ ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ, కాపు జేఏసీ కన్వీనర్ కేఎస్ఎన్ మూర్తి, కాపు ప్రముఖులు అరవ రామకృష్ణ, సమ్మెట ప్రసాద్, సుబ్బారావు, త్రినాథ్, మిరియాల ప్రీతమ్, కాప్స్ రాక్స్ వ్యవస్థాపకులు శివభాస్కర్, అడ్మిన్ జ్ఞానేశ్వర్, ప్రతినిధులు శివకుమార్, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.