- పర్యవేక్షించిన కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్
హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ గురువారం హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. డివిజన్ పరిధిలోని జీ హాబిటాట్, కల్కి హైట్స్, డబ్బు హైట్స్, సాయితేజ అపార్ట్‌మెంట్, మంజీరా రోడ్, రామకృష్ణ నగర్, మదీనాగూడ మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో సెల్లార్లలో, రహదారులపై నిల్వ ఉన్న వరద నీటిని మోటార్ల సహాయంతో తొలగించారు. పలు చోట్ల జేసీబీలతో వరద నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న బురద, చెత్తను తొలగించి నీరు సాఫీగా వెళ్లేలా చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఈ సందర్భంగా సూచించారు.