నమస్తే శేరిలింగంపల్లి: సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరో ఐదురోజులు పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత పది రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆదివారంతో ముగియ నుండగా మరో ఐదు రోజులు కొనసాగనుంది. గతంలో సూపర్‌స్ప్రెడర్స్‌గా పరిగణించి 9 కేటగిరిలకు అధనంగా మెడికల్ సిబ్బంది, శ్మశాన వాటికల సిబ్బందిని జత చేశారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఒక్కో వ్యాక్సినేషన్ సెంటర్ రోజుకు 1 వెయ్యి మందికి వ్యాక్సిన్ పంపిణీ జరుగగా ఇకపై ప్రతి సెంటర్‌లో 1500 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రైతు బజార్, కురగాయల మార్కెట్లు, మాంసం దుఖాణాలు, పూలు, పండ్ల దుఖాణాలు, కిరాణా, వైన్స్, వీది వ్యాపారులు, చాకలి, మంగలి వృత్తిదారులు, మెడికల్ సిబ్బంది, కాటికాపరులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిళ్ల ఉప కమిషనర్లు తేజావత్ వెంకన్న, సుధాంష్ నందగిరి తెలిపారు. ఐతే సదరు లబ్ధిదారులు నేరుగా వ్యాక్సినేషన్ సెంటర్లకు రావద్దని, స్థానికంగా ఉండే ఎస్ఆర్‌పీలు, ఎస్ఎఫ్ఏలు స్వయంగా దుఖానాల వద్దకు వచ్చి వారికి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేస్తారని తెలిపారు. ఈ క్రమంలో వారికి కేటాయించిన కేంద్రం, సమయం ప్రకారం వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.