బిల్లులు చెల్లించకుంటే ఆత్మహత్యే శరణ్యం – శేరిలింగంపల్లి ‌జోనల్ కార్యాలయం వద్ద సబ్ కాంట్రాక్టర్ నర్సింహా ఆవేదన

నమస్తే శేరిలింగంపల్లి: కూలీ నాలీ చేసుకుంటూ పోగేసుకున్న డబ్బులను కొందరి మాటలు విని అభివృద్ధి పనులకు రూ. 5 లక్షల వరకు ఖర్చు చేశాడు. పనులు పూర్తయి ఐదేళ్లవుతున్నా ఖర్చు చేసిన వాటికి జీహెచ్ఎంసీ అధికారులు బిల్లులు చెల్లించకుండా నానా అవస్థలు పెడుతున్నారు. “ఉన్నోడికి ఉట్ల పండగ..లేనోడికి లొట్ల పండగ..” అన్న చందంగా మారింది మన జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారుల పనితీరు. చెరువు సుందరీకరణ లో భాగంగా అభివృద్ధి కోసం ఖర్చు చేసిన‌ వ్యక్తి చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకోకపోవడంతో చివరకు ఆత్మహత్యే శరణ్యమంటూ భార్య పిల్లలతో కలిసి శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం వద్దకు వచ్చి తన గోడును వెల్లబోసుకున్నాడు.

శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం వద్ద తన ఆవేదన వ్యక్తం చేస్తున్న నర్సింహ

బాధితులు తెలిపిన ప్రకారం..శేరిలింగంపల్లి 106 డివిజన్ పరిధిలోని గోపీ చెరువు అభివృద్ధి ‌కోసం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఐదేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. పాపిరెడ్డి కాలనీ నుంచి గోపీనగర్ వరకు ఉన్న చెరువు కట్ట పనులను రవీందర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ ఈ పనులను టెండర్ ద్వారా దక్కించుకున్నాడు. రవీందర్ రెడ్డికి ఈ పనులకు ఏ మాత్రం గిట్టుబాటు లేకపోవడంతో కొన్ని రోజుల వరకు పనులు చేయకపోవడంతో అప్పటి డీఈ రాజ్ కుమార్, ఏఈ శంకర్ నాయక్, పలువురి సలహా మేరకు మజీద్ బండ వడ్డెర బస్తీ సమీపంలో నివసిస్తున్న బాండెడ్ లేబర్ అయిన నర్సింహా తదితరులు చెరువు కట్ట నిర్మాణం పనులు చేసేందుకు సబ్ కాంట్రాక్టర్ పద్దతిలో ముందుకు వచ్చారు. పాపిరెడ్డి నగర్ కాలనీ నుంచి గోపీనగర్ వరకు మధ్యలో ఉన్న‌ పెద్ద పెద్ద రాళ్లను తొలగించి చెరువు కట్టను‌ వేశారు. చెరువు కట్ట నిర్మించి ఐదేళ్లకు పైగా అవుతున్నా ఖర్చు చేసిన రూ. 5 లక్షల బిల్లులు నేటికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు బాధితుడు నర్సింహా వాపోతున్నాడు. అప్పటి ఇంజనీరింగ్ విభాగం అధికారులు స్థాన చలనం‌ కలిగి పదోన్నతులు పొందినా నేటికి బిల్లులు మంజూరు చేయకపోవడం బాధాకరమని పలువురు అంటున్నారు. ఇంట్లో‌ అమ్మ పరిస్థితి బాగాలేదని, తన అన్న తిమ్మయ్య రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స చేయిద్దామంటే డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నామని నర్సింహా వాపోతున్నాడు. తనకు రావాల్సిన బిల్లులు తనకు ఇవ్వాలని, ఆస్పత్రి రశీదు పత్రాలతో కుటుంబ సభ్యులతో శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం నర్సింహా వచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడంతో తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ తన గోడును వెల్లబోసుకున్నాడు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పేద కుటుంబానికి న్యాయం చేయాల్సిన‌ అవసరం ఎంతైనా ఉంది.

కుటుంబ సభ్యులతో నర్సింహా
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here