శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): కరెంట్ షాక్ తో విద్యార్థినికి తీవ్ర గాయాలు అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరెంట్ షాక్ తో విద్యార్థిని తీవ్రంగా గాయపడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చందానగర్ లోని రెయిన్బో స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్న గౌరీ(12) స్నేహితురాలితో కలిసి ఆడుతుండగా షటిల్ కాక్ విద్యుత్ తీగలపై పడింది. ఇనుపరాడు సహాయంతో కాక్ తీసేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్ షాకు గురైంది. షాక్ కు గురైన గౌరీని స్థానికులు గమనించి హాస్పిటల్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకొని సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ తల్లిదండ్రులను, బంధువులను పరామర్శించారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ జరిగిన ఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమని అన్నారు. బాలిక ఆరోగ్యం పై అరా తీయడం జరిగిందని, మెరుగైన వైద్యం కోసం కృషి చేస్తానని, తప్పకుండా న్యాయం చేస్తామని అన్నారు. పాఠశాల యాజమాన్యం తో మాట్లాడి సరైన న్యాయం చేస్తామని, అధైర్య పడవద్దు అని, తన వంతు సహాయ సహకారాలు ఉంటాయి అని , న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. నిర్లక్ష్యపురితంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, ఎల్లమయ్య, ఓ వెంకటేష్, హన్మంత్, నరేందర్ బల్లా, యశ్వంత్ , సుజాత తదితరులు పాల్గొన్నారు.