హైదరాబాద్, మార్చి 8 (నమస్తే హైదరాబాద్): కార్మిక సంక్షేమ అంజయ్య భవన్ లో కార్మికుల సమస్యలపై, వాళ్లకు రావలసిన సంక్షేమ ఫలాలపై సూపరింటెండెంట్‌కు సంఘం గౌరవ అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్, అధ్యక్షుడు బి అనంతయ్య, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మెమోరాండం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 60 సంవత్సరాలు పైబడిన లేబరు కార్డు కలిగిన కార్మికునికి కార్మిక బోర్డు తరఫున అందవలసిన ఆడపిల్లల పెళ్లి కానుక, ప్రసూతి సహాయం అందడం లేదని, సంక్షేమ ఫలాలు కార్మికుల వరకు చేరడం లేదని అన్నారు. 60 సంవత్సరాలు పైబడిన కార్మికులకు 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, మరణించిన కార్మికుడి కుటుంబానికి లక్ష రూపాయలు అంత్య క్రియల ఖర్చులకు ఇవ్వాలని కోరారు.
ప్రస్తుతం ఉన్న ప్రసూతి సహాయం 30,000 నుండి 50 వేలకు పెంచాలని, పెళ్లి కానుకలు 30 వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు పెంచాలని, హైదరాబాద్, ఇతర పట్టణాలలో లేబర్ అడ్డాలలో వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, కార్మికుల దాహం తీర్చే విధంగా సహాయ పడాలని, గుండె జబ్బులతో ఆకస్మిక మరణం, యాక్సిడెంట్లో చనిపోయిన వారికి యాక్సిడెంట్ కేస్ కింద డబుల్ బెడ్ రూమ్, ఇతర సంక్షేమ ఫలాలు ఇవ్వాలని కోరారు. ప్రమాదవశాత్తు గాయపడిన కార్మికునికి బెడ్ రెస్ట్ కింద ఇచ్చే సహాయం 300 నుండి 500 రూపాయలు పెంచాలని, యాక్సిడెంట్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా 6 లక్షల నుండి పది లక్షలు పెంచాలని అన్నారు.
ఈ కార్యక్రమములో గౌరవ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ బేరి రామచందర్ యాదవ్ తో పాటు బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, కార్మిక సంఘం అధ్యక్షుడు అనంతయ్య, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నరసింహ, జాతీయ భవన నిర్మాణ కార్మిక సేవా సంఘం ఉపాధ్యక్షుడు మల్లేష్, గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ ప్రెసిడెంట్. సెక్రెటరీ ఎస్ మహేష్, జాతీయ భవన నిర్మాణ కార్మికుల సేవా సంఘం ఉపాధ్యక్షుడుపోలిపాక వెంకన్న, విద్యార్థి నాయకుడు సతీష్, కార్మికులు పాల్గొన్నారు.