నమస్తే శేరిలింగంపల్లి: ఫాల్గుణమాసం శుక్లపక్ష ఉత్తర నక్షత్రం నేపథ్యంలో శ్రీ మహాలక్షి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని దీప్తీశ్రీనగర్ శ్రీ ధర్మపురి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకంతో పాటు 1108 తామరపువ్వులతో శ్రీ మహాలక్ష్మి సహస్రనామ పారాయణ సహిత మూలమంత్రంతో హోమం జరిపించారు. అదేవిధంగా శ్రీ అభయాంజనేయ స్వామి ధ్వజస్తంభం, శ్రీ సిద్ధి బుద్ధి, శ్రీ వల్లీ దేవసేన అమ్మవార్లను ప్రతిష్టించి 41 రోజులు(మండలం) పూర్తైన నేపథ్యంలో ఆయా స్వామివార్లకు విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. అదివారం నాడు ఢిల్లీలో జరగనున్న శక్తి పంచాయతన ధన్వంతరీ విశ్వశాంతి మహాయాగానికి శ్రీ ధర్మపురి క్షేత్రంలో మహా సంకల్పం జరిగింది. అక్కడి యాగానికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం సిద్ధించాలని కోరుకుంటూ పురోహితులు వేద మంత్రాల నడుమ గొట్టిపాటి శ్రీనివాస్, జ్యోత్స్న దుర్గా కుమార్‌లు అఖండ జ్యోతి ప్రజ్వలన చేశారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ విజయ దుర్గా దేవి కి పూర్ణిమ సందర్భంగా శ్రీ చక్ర పూజ, అభిషేకాలు, విశేష పూజలు అర్చనలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.