నమస్తే శేరిలింగంపల్లి: విశాఖ శ్రీ శారదా పీఠపాలిత చందానగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలోని శ్రీ భవాని శంకరాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తర పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి వార్ల దివ్యాశీస్సులతో పుల్లేటికుర్తి సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, లక్ష బిల్వార్చన, కలశ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం 8.15 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన జరిపించారు. గణపతి పూజ, పుణ్య హవచనం, మహాన్యాసము, ఉదయం 10.30 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకము, 11.30 గంటలకు అన్నాభిషేకము, మధ్యాహ్నం 12.30 గంటలకు కుంబాభిషేకము చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.30 గంటల వరకు సామూహికంగా లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన తో పాటు ప్రధాన హోమం, పూర్ణాహుతి, శాంతి కళ్యాణము, ఆశీర్వచనము చేశారు.
సాయంత్రం 6.30 గంటలకు పండిత సత్కారము, దాతలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీహెచ్ వి ఎస్ రాంగోపాల్, కె. వెంకట మారుతీ శ్యాంకుమార్ చే పుష్పాలంకరణతో ప్రత్యేక పూజలు చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.