నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ లోని హఫీజ్ పేట్ ఎంపీహెచ్ స్కూల్, జనప్రియ స్కూల్ లోని పోలింగ్ కేంద్రాలను బిజెవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ హఫీజ్ పేట్ ఎంపీహెచ్ స్కూల్ పరిధిలో 15 పోలింగ్ బూత్ లకు కేవలం నలుగురు బూత్ లెవెల్ ఆఫీసర్లు, జనప్రియ స్కూల్ లో 4 పోలింగ్ బూత్ లకు ఇద్దరు హాజరయ్యారని పేర్కొన్నారు. వీరికి ఓటర్ జాబితా పై కనీస అవగాహన లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందన్నారు. 18 ఏళ్ల పై బడిన వారు నూతన ఓటర్ గా నమోదు చేసుకోవడానికి కావాల్సిన ఫారం- 6, బీఎల్ఓ దగ్గర లేకపోవడంతో, ఓటు నమోదు చేసుకోవడానికి వచ్చిన వారు వెనక్కి వెళ్లిపోతున్నారని అన్నారు. ప్రతీ పోలింగ్ బూత్ లో నూతన ఓటర్లు నమోదు జరినప్పుడు ఆ జాబితాను ప్రత్యేకంగా చూపాలన్నారు. మరణించిన వారి పేర్లను, జాబితాలో రెండు సార్లు పేరు ఉన్న వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలని బీఎల్ఓ కు సూచించారు.