శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 4 (నమస్తే శేరిలింగంపల్లి): నగర సమస్యల పై ప్రత్యేక దృష్టి సారించినట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. నగరంలో పలు వార్డులో సమస్యలు తెలుసుకొని అక్కడిక్కడే పరిష్కారం చేయుటకు జోనల్ లోని ఆయా విభాగాల ఉన్నతాధికారులతో పాటు సంబంధిత కార్పొరేటర్ లతో కలిసి శానిటేషన్, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ, కాలనీలలో దీర్ఘకాలిక సమస్యల పై దృష్టి సారించి అవసరమైన మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు సుమారుగా 15 వార్డులలో పర్యటించి వివిధ సమస్యలతో పాటు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా నిధులు మంజూరు చేస్తున్న నేపథ్యంలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
హఫీజ్ పేట్ లోని పలు కాలనీలలో మేయర్ పర్యటించి శానిటేషన్, కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మేయర్ ఆర్టీసీ కాలనీలో శానిటేషన్, కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని, రోడ్డు వెడల్పు, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ, పార్కు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నలగండ్ల చెరువులో సి అండ్ వేస్ట్ తొలగింపుకు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు అభివృద్ధికి సి ఎస్ ఆర్ పద్ధతిలో చేస్తున్న నేపథ్యంలో రాంకీ వాళ్ళు వ్యర్థాలను తీసుకొని పోవడం లేదని అందుకు వెంటనే రాంకీ ప్రతినిధులతో మాట్లాడి వ్యర్థాల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నవోదయ కాలనీ సివరేజ్ వాటర్, సెంట్రల్ యూనివర్సిటీ నుండి వరద నివారణకు చేపట్టే పనులను మేయర్ పరిశీలించారు. మేయర్ వెంట కార్పొరేటర్ పూజిత, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, సి ఈ భాస్కర్ రెడ్డి, జోనల్ ఎస్ ఈ శంకర్ నాయక్, డిసి ముకుందా రెడ్డి తదితరులు ఉన్నారు.