- వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్న ప్రభుత్వ విప్ గాంధీ
- ప్రతి రోజు ఒక సెంటర్‌లో వెయ్యి మందికి కోవిడ్ టీకాలు
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సూపర్ స్ప్రెడర్స్ స్పేషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ శేరిలింగంపల్లిలో శుక్రవారం ప్రారంభం కానుంది. పది రోజుల పాటు జరగనున్న ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం శేరిలింగంపల్లి సర్కిల్‌కు సంబంధించి గచ్చిబౌలిలోని సంధ్య కన్వేన్షన్‌లో, చందానగర్ సర్కిల్‌కు సంబంధించి పీజేఆర్ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. సూపర్ స్ప్రెడర్స్‌గా ప్రభుత్వం గుర్తించిన కేటగిరీలు రైతుబజార్, స్థానిక కూరగాయలు, పండ్లు, పూల వ్యాపారులు, అదేవిధంగా మాంసం, చేపలు, కోళ్ల దుకాణదారులు, కిరాణ, లిక్కర్, హెయిర్ కటింగ్ షాప్‌ల నిర్వాహకులు, రోడ్లపైన చిరువ్యాపారులకు ఇప్పటికే కూపన్లు అందజేశామని రెండు సర్కిళ్ల ఉపకమిషనర్లు తేజావత్ వెంకన్న, సుధాంష్ నందగిరిలు తెలిపారు. పైన తెలిపిన కేటగిరీ వారందరూ జిహెచ్ఎంసి సిబ్బంది ఇచ్చిన కుపన్‌తో పాటు వారి ఆధార్ కార్డులను తీసుకొని వారికి తెలిపిన తేదీ, సెంటర్ ప్రకారం అటు సంధ్యా కన్వెన్షన్, ఇటు పీజేఆర్ స్టేడియంలకు చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శుక్రవారం ఉదయం వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభిస్తారని వారు తెలిపారు. ఐతే రెండు కేంద్రాల్లోను ఒక్కో రోజు 1000 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. అందుకోసం వ్యాకినేషన్‌లో పాల్గొనే సిబ్బంది, టీకా తీసుకునేందుకు వచ్చే సూపర్ స్ప్రెడర్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారి వత్సలా దేవి తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, కూపన్లు ఉన్నవారు మాత్రమే వ్యాక్సినేషన్ సెంటర్లకు రావాలని ఆమె సూచించారు.