నమస్తే శేరిలింగంపల్లి: కరోనా రెండవ దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కబ్జాదారులకు బాగా కలిసొస్తోంది. ఓ వైపు ప్రజలు ఇళ్లకు పరిమితమై, అధికారులు కరోనా కట్టడిలో నిమగ్నమై ఉన్న సమయాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటున్న అక్రమార్కులు ప్రభుత్వ, శిఖం భూముల్లో పాగా వేసేందుకు పకడ్భందీగా పావులు కదుపుతున్నారు. మొన్న చందానగర్ సర్వెనెంబర్ 174లోని ప్రభుత్వ భూమిని కొందరు స్థానికులు కబ్జా చేసేందుకు చూడగా శేరిలింగంపల్లి రెవెన్యూ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఆక్రమణకు అడ్డుకుట్ట పడింది. ఐతే ఆ ఘటన మరువక ముందే హైదర్‌నగర్ డివిజన్‌లో గతంలో ఓ శిఖం భూమిలో అధికారులు చర్యలు తీసుకున్న అక్రమ నిర్మాణాన్ని లాక్‌డౌన్ వేళ పూర్తి చేసేపనిలో పడ్డారు ఆక్రమణదారులు.

నిలిచిపోయిన భవన నిర్మాణం తిరిగి తుదిదశకు…
హైదర్‌నగర్ సర్వెనెంబర్ 173/1 లో 14.05 ఎకరాల స్థలంలో అలీతలాబ్ చెరువు విస్తరించి ఉంది. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపంతో చెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే చెరుకు దక్షిణం దిశగా రాంనరేష్‌నగర్‌కు ఆనుకుని ఆలీ తలాబ్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో దాదాపు 300 గజాల స్థలంలో ఒక అక్రమ నిర్మాణం మొదలు పెట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏకంగా 5 అంతస్థుల నిర్మాణాన్ని చేపట్టారు. కాగా స్థానికులు, ప్రజా సంఘాల ఫిర్యాదుతో ఫిబ్రవరి మాసంలో కుకట్‌పల్లి జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది సదరు నిర్మాణాన్ని పాక్షికంగా కూల్చి వేశారు. కాగా కరోనా సెకండ్ వేవ్ ఉదృతి నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌కు పిలుపునివ్వడంతో సదరు అక్రమ నిర్మాణ దారులు ఈ సమయాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. నిలిచిపోయిన నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తిచేసుకున్నారు. ప్రస్థుతం సదరు భవన నిర్మాణం పేయింటింగ్ పనులు హడావిడిగా కొనసాగుతున్నాయి. లాక్‌డౌన్ వేళ యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతుంటే స్థానిక రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు చూసి చూడనట్టు వదిలేయడం విడ్డూరం.

భాద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం…
అలీతలాబ్ శిఖం భూమిలో వెళిసిన అక్రమ నిర్మాణంపై కుకట్‌పల్లి తహసీల్దార్ గోవర్ధన్‌ను నమస్తే శేరిలింగంపల్లి వివరణ కోరగా సదరు అక్రమ నిర్మాణం తమ దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని అన్నారు. కుకట్‌పల్లి టౌన్‌ప్లానింగ్ ఏసీపీ వేణు వివరణ కోరగా సదరు నిర్మాణంపై గతంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు కూల్చివేతలు చేపట్టామని, తాజాగా తిరిగి నిర్మాణం చేపడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, భాద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో సదరు నిర్మాణాన్ని ఉపేక్షించబోమని తెలిపారు.