శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): రాజకీయవేత్త, పీడిత వర్గాల నేత, సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల ఎంసీపీఐ(యూ) ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో పోరాడుతూ ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ సీతారాం ఏచూరి మరణించారన్న వార్త భారత వామపక్ష శ్రేణులను, శ్రామిక వర్గ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆయన మరణం వామపక్ష, ప్రజాతంత్ర ఐక్య ఉద్యమాలకు తీరని లోటన్నారు. దేశంలో పాలకవర్గాలు, ప్రజల మధ్యన కుల మత తత్వాలు బలంగా రుద్దుతున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రజలను చైతన్యపరిచి దోపిడీ, అవకాశవాద రాజకీయ విధానాలను ఎండగట్టే ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేసే సమయంలో ఏచూరి మరణం తీరని నష్టమని పేర్కొన్నారు. దేశ రాజకీయాలలో వామపక్ష రాజకీయ నేతగా క్రియాశీల పాత్ర పోషించిన ఏచూరి ప్రస్తుత దేశ రాజకీయ పరిణామాలలో ఆయన లేని లోటు తీవ్ర నష్టం అని అన్నారు. ఆయన అనారోగ్య మరణానికి ఎంసీపీఐ(యూ) ప్రగడ సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన కుటుంబానికి సానుభూతిని ప్రకటిస్తుందన్నారు.సీతారాం ఏచూరి (ఫైల్)