శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): ట్రిపుల్ ఆర్ రీజినల్ రింగ్ రోడ్డులో భూమి కోల్పోయిన రైతులకు డబ్బులు వద్దు భూమి కావాలని కోరుతూ బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు భేరి రామచంద్రయాదవ్, ముఖ్య సలహాదారు కృష్ణారావులు గురువారం మంత్రి శ్రీధర్ బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామచంద్రయాదవ్ మాట్లాడుతూ భూములను కోల్పోయిన రైతులకు ఆ జిల్లాలో కానీ లేదా ఆ మండలంలో కానీ మరో చోట భూమి ఇవ్వాలని కోరారు. రీజినల్ రింగు రోడ్డు నిర్మాణంలో భాగంగా చాలా మంది రైతులు సాగు చేసే భూములను కోల్పోయారని కనుక వారికి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు అధ్యక్షుడు మధు యాదవ్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్కే సాయికుమార్, కార్యదర్శి మొర్రి శ్యామ్ కుమార్, మాజీ ఉప సర్పంచ్ భీమయ్య, భరత్, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.