శేరిలింగంపల్లి, మే 25 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ లోని అన్నమాచార్య భావనవాహినిలో డా. శోభా రాజు ఆధ్వర్యంలో అన్నమ స్వరార్చన నిర్వహించారు. ఇందులో భాగంగా అన్నమాచార్య భావనా వాహిని సంస్థ నుండి డా. శోభా రాజు దగ్గర సంకీర్తనలు నేర్చుకున్న విద్యార్థిని శ్రద్ధ యలమర్తి సుస్వరంగా గణరాజ గుణరాజ, తాళ్ళపాక అన్నమాచార్య, దేవునికి దేవికిని, కొండా చూతము రారో, చిత్తము కొలది, రమ్మా వరలక్ష్మి, చదువు చెప్పవమ్మా, నా మనసే తిరుపతి, వేడుకుందామా, పసిడి ఉయ్యాల అనే ప్రఖ్యాత అన్నమయ్య సంకీర్తనలను భక్తి శ్రద్ధలతో ఆలపించి అందరి మన్ననలు పొందింది.
వీరికి శ్రీనివాస్ కీ బోర్డు పై, అజయ్ తబలా పై వాయిద్య సహకారం అందించారు. కళాకారులను సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్, శోభా రాజు జ్ఞాపికలతో సత్కరించారు. చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామికి మంగళ హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.