యాదగిరిగుట్ట, మార్చి 8 (నమస్తే యాదగిరిగుట్ట): యాదగిరిగుట్టలో శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు, ఆమె శిష్య బృందం, వసంతి, అర్చన, ఆశ్రిత, వల్లీ, శ్రీ హరిప్రియ, శశికళ, బి.వి.శర్మ, శ్రీహి, వేద, సహస్ర, పద్మావతి, మారుతి విజయలక్ష్మి, అభిరామ్, అక్షయ, సువర్ణ, రాధిక, పూర్వజ్, శారద, నారాయణి సంయుక్తంగా ఉగ్రం వీరం (నమామ్యహం మానవ సింహం), కొండల్లో నెలకొన్న, శిరుత నవ్వుల వాడే, ప్రహ్లాద వరద గోవిందా, అంబుజాక్షలము ప్రహ్లాద వరదా అనే బహుళ ప్రాచుర్యం పొందిన అన్నమయ్య సంకీర్తనలు సుస్వరంగా సుమారు ఒక గంటన్నర పాటు మధుర భక్తి పూర్వకంగా, మనోరంజకంగా ఆలపించారు.
వీరికి కీ బోర్డు మీద రాజు, తబలా మీద రమణ మూర్తి వాయిద్య సహకారం అందించారు. తదనంతరం ఆలయ పెద్దలు శోభారాజుకి గౌరవ సత్కారం చేశారు. వారి శిష్య బృందాన్ని ప్రశంసించి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమానంతరం శోభా రాజు స్వామి వారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.