నమస్తే శేరిలింగంపల్లి: జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు, సిద్దాంతాలు అందరూ ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసన మండలి సభ్యురాలు, ప్రముఖ విద్యావేత్త సురభి వాణి దేవి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల లో భాగంగా మహాత్మా గాంధీ 152 వ జయంతిని పురస్కరించుకొని కేంద్ర సమాచార, ప్రసార శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి) మహాత్మా గాంధీ జీవిత విశేషాల పై శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను గురువారం ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీజీ అనుసరించిన, అభిలషించిన సత్యం, అహింస, స్వచ్ఛత, మహిళల అభ్యున్నతి, గ్రామాల్లో స్వయం పాలన లాంటి సిద్ధాంతాలను నేటి తరం తెలుసుకోవాలని అన్నారు. గాంధీజీ జీవితం ప్రధాన ఇతివృత్తంగా మహాత్మునికి ఎంతో ఇష్టమైన ‘వైష్ణవ జనతో’ ప్రార్థనా గీతం నేపథ్యంగా రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో గేయ నాటక విభాగం కళాకారులు ప్రదర్శించిన ‘‘గాంధీ మార్గం’’ నాటిక ఆహుతులను ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా పిఐబి, ఆర్ఒబి డైరక్టర్ శృతి పాటిల్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ 152వ జయంతిని పురస్కరించుకొని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో’ భాగంగా కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన క్షేత్రస్థాయి విభాగాలు పలు కార్యక్రమాలు, ఛాయాచిత్ర ప్రదర్శనలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ ఛాయాచిత్ర ప్రదర్శనలో గాంధీజీకి సంబంధించిన స్వాంతంత్య్ర పోరాటంలోని వివిధ కీలక అంశాలను ఏర్పాటుచేశారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ మూడు రోజుల పాటు సందర్శకుల కోసం ఉంటుందన్నారు.