నమస్తే శేరిలింగంపల్లి: దిశ దినపత్రిక శేరిలింగంపల్లి ఇంఛార్జీ తుడుం భూమేష్ పై కేపీహెచ్ బీ పోలీసులు అనుచితంగా వ్యవహరించిన తీరుపట్ల నిరసన వ్యక్తం చేసిన శేరిలింగంపల్లి జర్నలిస్టులు సోమవారం మాదాపూర్ డీసీపీ శిల్పవల్లికి ఫిర్యాదు చేశారు. కేపీహెచ్ బి పోలీసుల వైఖరిపై సమగ్ర విచారణ జరిపి భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధం లేని కేసులో భూమేష్ ను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఒక ఉగ్రవాది మాదిరిగా అతని ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించి, మరీ అతన్ని ఇంటిలో నుండి కిడ్నాప్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తలు రాయడమే నెరమనే విధంగా రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు జర్నలిస్టుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్థంభం అయిన జర్నలిస్టులను అణిచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇదే విధంగా వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్త జర్నలిస్టులం ఏకమై ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఫిర్యాదు సమర్పించిన వారిలో జర్నలిస్టులు లక్ష్మీనారాయణ, కొండా విజయ్ కుమార్, వినయకుమార్ పుట్ట, మల్లేష్ గౌడ్, రాజేష్, అనిల్, వరుణ్, సాల్వేడర్ టిల్లు, హేమంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బస్వరాజు, లక్ష్మణ్, వెంకటేశ్, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ ప్రసాద్, యాకయ్య, హరికృష్ణ, సాగర్ రెడ్డి, కొండల్ రెడ్డి, అశోక్ రెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.