శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా శేరిలింగంపల్లికి చెందిన రాగం సతీష్ యాదవ్ మంగళవారం నామినేషన్ వేశారు. మొదటగా ఖైరతాబాద్ లోని ఆంజనేయ స్వామి ఆలయంలో రాగం సతీష్ యాదవ్ పూజలు నిర్వహించి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంకకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పట్టభద్రుల, నిరుద్యోగుల బాధలు వర్ణనాతీతమన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలతో పట్టభద్రులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సైతం నిరాశలో ఉన్నారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ 12 రోజుల పాటు వరుసగా చమురు ధరలను పెంచుకుంటూ పోతున్నదని, పేద ప్రజల సొమ్మును కాజేసి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుందని రాగం సతీష్ యాదవ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తామేం తక్కువ తిన్నామా అన్నట్లుగా సామాన్యుడిపై పెట్రోల్, డీజిల్ ధరల భారం మోపుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి లక్షా 40 వేల ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారో నిరూపించాలన్నారు. ఉద్యోగాలు లేక పట్టభద్రులు నిరుద్యోగులుగా మారారని అన్నారు. నిరుద్యోగ భృతిని సైతం ఇవ్వడం లేదన్నారు. టీఆర్ఎస్ పాలకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయన్నారు. నిరుద్యోగులకు అండగా మన కొలువులు మన హక్కులు అనే నినాదంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు రాగం సతీష్ యాదవ్ చెప్పారు.
