చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): సంకల్ప ఫౌండేషన్ అనాథ చిన్నారులకు చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని సంకల్ప్ ఫౌండేషన్ లో నివసిస్తున్న మౌనిక వివాహ ఖర్చుల నిమిత్తం ఆయన రూ.50వేల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపేణా సంకల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రోజీకి అందజేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సంకల్ప్ ఫౌండేషన్ ఎంతో మంది అనాథ పిల్లలను చేరదీసి పెంచి పెద్ద చేసి విద్యా బుద్ధులు నేర్పించి వారి జీవితానికి ఒక దారి చూపిస్తుందని కొనియాడారు. అనాథలకు చేయూతను అందించడం చాలా గొప్ప విషయమని ఫౌండేషన్ డైరెక్టర్ రోజీని గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. యువతి మౌనిక వివాహానికి తన వంతు సహాయంగా రూ.50వేలను సంకల్ప్ ఫౌండేషన్ కు అందించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంకల్ప్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.