- బిసి మంత్రికి విన్నవించిన సగర సంఘం రాష్ట్ర కమిటీ
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సగర కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించాలని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ కోరింది. శుక్రవారం హైదరాబాద్ ఖైరతాబాద్ లోని మంత్రి కార్యాలయంలో ఏర్పాటుచేసిన బిసి ఫెడరేషన్ల కులాల సమావేశంలో సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన సగర జాతి ప్రజల జీవన స్థితిగతులు దయనీయంగా ఉన్నాయని అన్నారు. నిర్మాణ రంగంపై ఆధారపడిన సగర కులస్థులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు గతంలో ఉన్న ఫెడరేషన్లను కొనసాగిస్తూ బడ్జెట్ కేటాయించాలని లేని పక్షంలో కార్పరేషన్ ను ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయాలని కోరారు. కోకాపేటలో ప్రభుత్వం సగరులకు కేటాయించిన స్థలం యథావిధిగా కొనసాగించాలని అన్నారు. ఆత్మ గౌరవ భవనాల స్థలం విషయంలో సగర జాతిని అవమానించకూడదని కోరారు. మంత్రి గంగుల కమలాకర్ స్పందిస్తూ త్వరలోనే బిసి కులాల ప్రతినిధులతో మూడు రోజుల పాటు వర్క్ షాప్ ఏర్పాటుచేసి సమగ్ర సమాచారాన్ని సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోకాపేట స్థలం మారకుండా చర్యలు తీసుకునే బాధ్యత తనదేనని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బిసి ఫెడరేషన్ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు దుర్గారావు, బిసి సంఘాల నాయకులు కుందారపు గణేశాచారి, గుజ్జ కృష్ణ, సగర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, ఉపాధ్యక్షులు చిలుక సత్యం సగర, విజయేంద్ర సగర, ఎం.రాములు సగర, గ్రేటర్ సగర సంఘం అధ్యక్షుడు మోడల రవి సగర, కోశాధికారి రామస్వామి సగర పాల్గొన్నారు.