నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్, బిఎల్ఎఫ్ నాయకులు పల్లె మురళి పేర్కొన్నారు. మియాపూర్ బస్ డిపో వద్ద అక్టోబర్ 5న ఆర్టీసీ పరిరక్షణ కార్మికుల త్యాగాల దినంగా పాటించాలని టిఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మియాపూర్ వన్ డిపోలో ఆర్టీసీ పరిరక్షణ కార్మికుల త్యాగాల దినం నిర్వహించారు. జ్ఞానేంద్ర ప్రసాద్, పల్లె మరళిలు పాల్గొని 38 మంది కార్మికుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి 2019 అక్టోబర్ 5 నుంచి ప్రారంభమైన ఆర్టీసీ సమ్మె లో 55 రోజుల పోరాటంలో 38 మంది ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు పోగొట్టుకోవడం బాధాకరమన్నారు. వారి త్యాగాలను ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండడం దారుణమన్నారు. 2017 ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణ ఇప్పటివరకు లేదన్నారు. 2021లో ఏప్రిల్ 1న మరో వేతన సవరణ చేయాల్సి ఉన్నా ఇప్పటివరకూ స్పందించలేదని ఎద్దేవా చేశారు. రెండు వేతన సవరణలు చేయాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఈమని వినాయక రెడ్డి, రాజబాబు, భాస్కర్, అశోక్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.