నాలాలో గల్లంతైన బాలయ్య కుటుంబానికి రూ.50 వేల సాయం.. ప్రభుత్వం స్పందించాలి: వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జులై 28న సాయంత్రం కురిసిన భారీ వర్షం సమయంలో హఫీజ్‌పేట్ డివిజన్ ప్రేమ్‌నగర్‌కు చెందిన 60 ఏళ్ల బాలయ్య ప్రమాదవశాత్తూ నాలాలో పడి గల్లంతయ్యాడ‌ని, ఇప్పటివరకు ఆయన ఆచూకీ లభించకపోవడం బాధాకరమని వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు వేగవంతంగా లేవని ఆయన ఆరోపించారు. బాలయ్య కుటుంబాన్ని పరామర్శించిన వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్.. ఆయన సతీమణి పద్మను ఓదార్చారు. ఈ సందర్భంగా పద్మ కన్నీటి పర్యంతమవుతూ.. ‘బాలయ్య ఎముకలు అయినా త‌న‌కు ఇప్పించాల‌ని వేడుకోవడం అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసిందని వాసిలి తెలిపారు.

ఒక ప్రజాప్రతినిధి, వారి బంధువు లేదా ఆర్థికంగా ఉన్న వ్యక్తి నాలాలో పడితే ఇదే విధంగా చర్యలు తీసుకుంటారా అని వాసిలి ప్రశ్నించారు. పేదలకు ఒక న్యాయం, డబ్బున్న వారికి మరో న్యాయం ఉండకూడదని.. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న ప్రజాపాలన అని నిలదీశారు. బాలయ్య కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాలయ్య పిల్లలకు మున్సిపల్‌లో ఉద్యోగాలు కల్పించాలని, ఆయన సతీమణి పద్మకు వెంటనే డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కేటాయించాలని, ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల నష్టపరిహారం అందించాలని కోరారు. 2019 ఆగస్టులో చందానగర్ డివిజన్ పీజేఆర్ రోడ్డులోని పీజేఆర్ ఎన్‌క్లేవ్ నాలాలో 35 ఏళ్ల శ్రీకాంత్ రెడ్డి ప్రమాదవశాత్తూ పడి మృతి చెందిన ఘటనను ఈ సందర్భంగా వాసిలి గుర్తు చేశారు. అప్పట్లో శ్రీకాంత్ రెడ్డి కుటుంబానికి తన సొంత నిధుల నుంచి రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం అందించానని తెలిపారు. అయితే ఇప్పటివరకు శ్రీకాంత్ రెడ్డి సతీమణికి ప్రభుత్వం తరఫున ఉద్యోగం లేదా తగిన న్యాయం జరగలేదని పేర్కొన్నారు.

ఇంకా ఎంతమంది ప్రజలను నాలాలకు బలిచేసి వారి కుటుంబాలను రోడ్డున పడేస్తారని ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టర్లను వాసిలి ప్రశ్నించారు. నాలాల చుట్టూ పటిష్టమైన కంచెలు ఏర్పాటు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నిలదీశారు. బాలయ్యను తిరిగి తీసుకురాలేకపోయినా, ఆయన కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని పద్మకు అందించినట్లు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ తెలిపారు. బాలయ్య ఆచూకీ కోసం గాలింపు చర్యలను వేగవంతం చేసి, ఆయన కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నగరంలోని నాలాల చుట్టూ పటిష్టమైన రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here