మదర్ థెరిసా జయంతి వేడుకలు.. సేవామూర్తులకు సేవారత్న పురస్కారాలు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జయంతి వేడుకలను ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం మాదాపూర్‌లోని స్వాతి హైస్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మదర్ థెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. కార్యక్రమానికి హెచ్‌సీయూ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా, రాగం మల్లికార్జున యాదవ్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. మదర్ థెరిసా తన జీవితాన్ని పేదలు, అనాథలు, రోగుల సేవకు అంకితం చేసిన గొప్ప మానవతావాది అని కొనియాడారు. మానవ సేవే మాధవ సేవ అనే సూత్రాన్ని నమ్మి సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం ఆమె చేసిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు.

1950లో కేవలం 13 మంది సభ్యులతో, నీలం అంచు ఉన్న తెల్లని చీరను ధరించి మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించిన మదర్ థెరిసా.. అనంతరం ఆ సేవా సంస్థను ప్రపంచవ్యాప్తంగా విస్తరించారని గుర్తుచేశారు. మరణశయ్యపై ఉన్న నిరుపేదలు, అనాథలు రోడ్లపక్కన దిక్కులేకుండా మరణించకూడదనే ఉద్దేశంతో కలకత్తాలోని కాళీఘాట్‌లో నిర్మల్ హృదయ్, అనాథ పిల్లల కోసం శిశు భవన్ వంటి సంస్థలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఇవి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనాలని పేర్కొన్నారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ.. సమాజంలో మానవ సేవే మాధవ సేవగా భావించి వివిధ రంగాల్లో అంకితభావంతో సేవలందిస్తున్న వారిని గుర్తించి సేవారత్న పురస్కారాలతో సత్కరిస్తున్నామని తెలిపారు.

 

మదర్ థెరిసా భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆమె స్థాపించిన సంస్థల ద్వారా దయ, కరుణ, సేవాభావం కోట్లాది మందికి నేటికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని స్వాతి హైస్కూల్ ప్రిన్సిపాల్ చంద్రిక అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ఎం. అరుణ, ఎం. వెంకటరావు, డాక్టర్ కె. అరుణశ్రీ, డాక్టర్ రాజ్ కుమార్ లట్టుపల్లి (జాయ్ ఫౌండేషన్), జి.ఎస్.డి. గుప్తా (షిరిడీ సాయిబాబా అసోసియేషన్, రిటైర్డ్ బీహెచ్ఈఎల్ ఏజీఎం)లకు అతిథుల చేతుల మీదుగా సేవారత్న పురస్కారాలను ప్రదానం చేశారు. దుశ్శాలువ, జ్ఞాపిక, పగిడి, తాంబూలంతో వారిని ఘనంగా సత్కరించారు. పురస్కార గ్రహీతలు తమ సేవలకు గుర్తింపు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రోత్సాహంతో మరింత మందికి స్ఫూర్తినిచ్చేలా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కొత్తపల్లి కోటేశ్వరరావు, డా. రామన్న, డి.వి.కె.రావు, సుబ్బారావు, వాణీ సాంబశివరావు, విష్ణు ప్రసాద్, పాలం శీను, శివరాం రెడ్డి, బాలన్న, డా. సాంబశివరావు, తెలుగు శాంతి కుమార్, డా. లతాగుప్త, సత్యనారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here