విద్యార్థుల చలో పార్లమెంట్ నిరసనలపై పోలీసు చర్యలు ఖండన

శేరిలింగంప‌ల్లి, జూలై 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): విద్యార్థుల చలో పార్లమెంట్ పిలుపు సందర్భంగా జరిగిన పోలీసు చర్యలను యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో పాటు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విద్యార్థుల నిరసనలను అక్రమ అరెస్టులతో అణచివేస్తోందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఆరోపించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వ్యక్తమవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నిరసనలు చేపట్టిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌ను అర్ధరాత్రి అరెస్టు చేసి తగిన వైద్య సౌకర్యాలు లేకుండా ఆస్పత్రిలో ఉంచడం అభ్యంతరకరమని విమర్శించారు.

విద్యార్థులు శాంతియుతంగా నిర్వహించిన చలో పార్లమెంట్ కార్యక్రమంపై లాఠీచార్జీ, టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు, వాటర్ కానన్‌లను వినియోగించి హింసాత్మకంగా వ్యవహరించారని, ఈ ఘటనల్లో వందలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉద్యమకారులు గాయపడ్డారని ఆరోపించారు. అలాగే అనేక మందిపై తప్పుడు కేసులు నమోదు చేసి అక్రమ అరెస్టులు చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలకు నిరసనగా హైదరాబాద్‌లోని లోక్ భవన్ ఎదుట వామపక్ష విద్యార్థి సంఘాలు నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న విద్యార్థి నాయకులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని గాదగోని రవి విమర్శించారు. అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (AIFDS) రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, రాష్ట్ర నాయకుడు కుమార్‌తోపాటు పలువురు విద్యార్థి నాయకులను బలవంతంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను మార్చే ప్రయత్నంలో భాగంగానే ప్రశ్నాపత్రాల లీకేజీలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు మద్దతుగా నిలవాల్సిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరినే అనుసరించడం సరైనది కాదన్నారు. అక్రమంగా అరెస్టు చేసి తప్పుడు కేసులు నమోదు చేసిన విద్యార్థి నాయకులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విడుదల చేయాలని యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here