శేరిలింగంపల్లి, మార్చి 28 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో నెలకొన్న పలు సమస్యలపై, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై, పెండింగ్ లో ఉన్న రోడ్ల విస్తరణ పనులు, పారిశుధ్య కార్మికుల సమస్యలు, వీధి దీపాలు వంటి అంశాలపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అసెంబ్లీ వేదికగా మాట్లాడారు.ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం దేశంలోనే పెద్ద నియోజకవర్గం అని , అత్యధిక ప్రజానీకం నివసిస్తున్న ప్రాంతం అని , ముంబాయి జాతీయ రహదరికి ఇరువైపులా ఉన్న భాగం అని అన్నారు. ఒక వైపు రోడ్లు పూర్తి స్థాయిలో అయ్యాయని, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గచ్చిబౌలి ప్రాంతంలో రూ. 1650 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన తరుపున, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని అన్నారు.
ముంబాయి జాతీయ రహదారికి మరో వైపు గల రోడ్ల కు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని PAC చైర్మన్ గాంధీ కోరారు. ఉషముళ్ళపూడి రోడ్డు విస్తరణ పనులు, JNTU నుండి ప్రగతి నగర్ వరకు రోడ్డు విస్తరణ, ఫ్లై ఓవర్ నిర్మాణం ,నిజపేట్ రోడ్డు, గంగారాం హనుమాన్ దేవాలయం నుండి అపర్ణ అపార్టుమెంట్ వరకు నిర్మించే లింక్ రోడ్డు వంటి రోడ్ల అభివృద్ధి చేయాలని, చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్నాయి అని, అత్యధిక జనవాసం కలిగి అత్యధిక ట్రాఫిక్ కూడిన ప్రాంతాలు కావున ఈ పెండింగ్ రోడ్ల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిధులు మంజూరు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని కోరారు.
పరిసరాలను పరిశుభ్రంగా చేసే పారిశుధ్య కార్మికుల సంక్షేమం, వారి సమస్యలను పరిష్కరించాలని, 30 – 40 సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికుల సమస్య తీవ్రంగా ఉంది అని ఒక సర్కిల్ లో 550 మంది కార్మికులు ఉంటే 200 నుండి 250 మాత్రమే పనిచేస్తున్నారు అని, అన్ని ప్రాంతాలు విస్తరించి ఉన్నాయని అన్నారు. శేరిలింగంపల్లి, చందానగర్, కూకట్పల్లి సర్కిల్ లలో ఎక్కడ 50 శాతం మించి పనిచేయడం లేదని, గతంలో రిటైర్మెంట్ అయినవారు చనిపోయిన వారి కుటుంబాలలో ఒకరికి జోనల్ స్థాయిలో అపాయింట్మెంట్ ఇచ్చేవారు. కానీ ఆ పరిస్తితులు ఇప్పుడు లేవు అని, 2-3 సంవత్సరాల నుండి ఆగిపోవడం జరిగిందన్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అపాయింట్మెంట్ చేసి వారి కుటుంబాలలో వెలుగులు నింపాలని, పరిశుభ్రత తో కూడిన మంచి ప్రాంతాలుగా తిర్చిదిద్దే కార్యక్రమంలో బాగస్వామ్యం కావాలని అన్నారు.
గత రెండు సంవత్సరాలు గా LED వ్యవస్థ ను మనం ప్రారంభించుకున్నాం అని బాగా పనిచేస్తుందని, కానీ రిపేర్ చేసే నాధుడే లేడు అని ,గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 కోట్ల రూపాయల నిధులు కేటాయించి కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరిగిందని దీని ద్వారా కొంత వ్యవస్థ మెరుగైందని అన్నారు. వేల కోట్ల రూపాయలతో LED వ్యవస్థను ఏర్పాటు చేస్తే వీధి దీపాలు పాడైతే బాగు చేసే విధానం లేకుండ పోయిందని, బాగు చేసే వ్యవస్థను ఏర్పాటు చేసి విధి దీపాల వ్యవస్థను మెరుగుపర్చాలని, ఎలక్ట్రిసిటీ బోర్డ్ నుండి GHMC కి అధికారులు బదిలీ పై వస్తున్నారు. SE, DE లెవల్ లో వస్తున్నారు. కానీ AE లెవల్ లో ఒక్క అధికారి లేకుండా పోయారు అని ఈ వ్యవస్థను పూర్తిగా మూసివేసే పరిస్థితి వచ్చింది అని , అన్ని ప్రాంతాలు చీకటి మయం అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని వీధి దీపాల వ్యవస్థను మెరుగుపర్చాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ PAC చైర్మన్ గాంధీ మాట్లాడిన వివిధ అంశాలను నోట్ చేసుకున్నాం అని తెలిపారు.