శేరిలింగంపల్లి, మే 4 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల అపర్ణ సైబర్ కౌంటీలో వృక్షాల నరికివేతను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాలనీలో 16 ఏళ్ల నుంచి 100కు పైగా కదంబ వృక్షాలు ఉన్నాయని అన్నారు. ఇటీవలే ఆ వృక్షాలకు చెందిన ఎండిన కొమ్మలు నేలకొరుగుతుండడంతో సరైన చర్యలు చేపట్టాలని తాము సంబంధిత జీహెచ్ఎంసీ విభాగానికి చెందిన అధికారులను కోరామని, ఈ మేరకు తమ కాలనీ సమావేశంలోనూ నిర్ణయించామని తెలిపారు. కానీ ఇటీవలే కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే 30కి పైగా చెట్లను నరికివేశారని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి కానీ ఇలా నాశనం చేయడం సరికాదని, చెట్లను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇకనైనా మిగిలిన చెట్లను రక్షించాలని వారు కోరారు.