నమస్తే శేరిలింగంపల్లి: రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.12 లక్షల మున్సిపల్ నిధులతో ఏర్పాటుచేసిన 68 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలను మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమరం భీమ్ కాలనీలో 20, అంబేద్కర్ కాలనీలో 32, కొల్లూరులో 16 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని అన్నారు. అందుకు కృషి చేసిన స్థానిక నేతలకు, నిధులు మంజూరు చేసిన మున్సిపల్ అధికారులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంవల్ల పోలీసుల భద్రతకు మరింత నమ్మకం తోడవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ ఏసీపీ కృష్ణ ప్రసాద్, రామచంద్రపురం సీఐ జగదీశ్, మున్సిపల్ సిబ్బంది స్థానిక నాయకులు పాల్గొన్నారు.
