- రానున్న అన్ని ఎన్నికల్లో భారాస విజయం సాధించాలని అమ్మవారికి మొక్కులు
శేరిలింగంపల్లి, అక్టోబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనుక దుర్గమ్మ అమ్మవారిని భారాస రాష్ట్ర నాయకుడు, శేరిలింగంపల్లి యువ నేత రవీందర్ యాదవ్ దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ కు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. రానున్న అన్ని ఎన్నికల్లో భారాస ఘన విజయం సాధించాలని బెజవాడ కనుక దుర్గమ్మను మొక్కున్నట్లుగా రవీందర్ యాదవ్ వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటాము అని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. కాంగ్రెస్ నేతలకు రాష్ట్రాన్ని దోచుకోవడంలో ఉన్న ఆసక్తి అభివృద్ధి చేయడంలో లేదన్నారు.

సీఎంగా కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్నింట్లో అగ్రపథంలో నిలిచిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తేవడమే కాకుండా అభివృద్ధి చేసి చూపించిన ఘనత కేసీఆర్ కే దక్కిందని కొనియాడారు. మున్సిపల్, ఐటీ శాఖల మంత్రిగా నాడు కేటీఆర్ హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరాల సరసన నిలబెట్టారన్నారు. దాన్ని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కాపాడటంలో విఫలం అయ్యిందన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా రూపు రేఖలు మార్చిన కేటీఆర్ ను కుట్ర పూరితంగా ఇబ్బందులు పెట్టేలా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను వంచించేలా కాంగ్రెస్ సర్కార్ తీరు ఉందన్నారు. బీసీలు కాంగ్రెస్ పార్టీని తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయి అని వెల్లడించారు.





