శేరిలింగంపల్లి, మే 7 (నమస్తే శేరిలింగంపల్లి): ఉద్యమ స్ఫూర్తితో శేరిలింగంపల్లిలో పార్టీ కోసం ముందుండి పోరాడాలని బీఆర్ఎస్ నేత రవీందర్ యాదవ్ కు మాజీ మంత్రి, భారాస సీనియర్ నేత హరీష్ రావు సూచించారు. పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని, త్వరలో జరిగే పదవుల పంపకాల్లో అవకాశం దక్కనుందని వెల్లడించారు. హైదరాబాద్ లోని హరీష్ రావు నివాసంలో ఆయనను రవీందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేతో జరిగిన వివాదం నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. రవీందర్ యాదవ్ ముందుండి పోరాడారని హరీష్ రావుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివరించారు.
స్థానికంగా మంచి పేరున్న యువనేతగా రవీందర్ యాదవ్ ఎదుగుతున్నారని కొనియాడారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. శేరిలింగంపల్లిలో భారాస పార్టీనే రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్నారు. శేరిలింగంపల్లిలోని ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని, మరోసారి అలాంటి పొరపాట్లు జరగవని వెల్లడించారు. ప్రజా సమస్యలపై పోరాడాలని రవీందర్ యాదవ్ కు సూచించారు. త్వరలోనే గుడ్ న్యూస్ ఉంటుందని చెప్పారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న తీరు అద్భుతమని ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. పార్టీ కార్యక్రమాలను మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లుగా తెలిపారు. పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు. ఎంత మంది పార్టీలు మారినా రానున్న అన్ని ఎన్నికల్లో భారాస గెలుపును ఎవరూ ఆపలేరని రవీందర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చిన సంతోషంతో పని చేస్తామని వెల్లడించారు.