శేరిలింగంపల్లి, జనవరి 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో రోడ్లు, డ్రైనేజీ ,ట్రాఫిక్ సమస్యలు, మౌలిక వసతుల కల్పన పై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిని కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో దాదాపు అన్ని డివిజన్లలో చాల వరకు రోడ్లు , డ్రైనేజీ వ్యవస్థ పాడైపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని , అలాగే ఆఫీసులు అన్ని తెరుచుకున్నాయని ట్రాఫిక్ సమస్యలు కూడా పెరిగాయని , ఇళ్లకు ,ఆఫీసులకు చేరుకోవడానికి గంటల తరబడి సమయం పడుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు,వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చాలా మంది ఇదే విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. కావున తక్షణమే రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ చేయాలని, ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని కోరారు. ఇందుకు జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
