నమస్తే శేరిలింగంపల్లి: తెలుగుదేశం పార్టీ శేరిలింగంపల్లి 106 డివిజన్ డివిజన్ అధ్యక్షుడు రేవెళ్ల రాజేష్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. డివిజన్ సెక్రటరీ హబీబ్, యూత్ ప్రెసిడెంట్ జగన్ మహిళా నాయకురాలు అన్నపూర్ణ తో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు జైపాల్ తో కలిసి రేవెళ్ల రాజేష్ సోమవారం గాంధీ భవన్ కు తరలివెళ్లారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్టి రేవెళ్ల రాజేష్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రాజేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు అని చెబుతూ మభ్య పెడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలన నుండి విముక్తి కావాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. కష్టపడి పనిచేసే వారికి కాంగ్రెస్ పార్టీలో మంచి హోదా దక్కుతుందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పలు సూచనలు చేసినట్లు రేవెళ్ల రాజేష్ వెల్లడించారు. శేరిలింగంపల్లి డివిజన్ నుండి మహిళలు, యువకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరినట్లు చెప్పారు.