శేరిలింగంపల్లి, జనవరి 3 (నమస్తే శేరిలింగంపల్లి): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రాజీవ్ స్వగృహ, హుడా కాలనీ, సురక్ష ఎన్‌క్లేవ్ లలో మహళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన అనంతరం కొమిరిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షుడు కొమిరిశెట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ పరిశుభ్రత, ఆరోగ్యం, అలంకరణల మేళవింపే ముగ్గులు అని అన్నారు. ఈ పోటీల వలన మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తి వెలికి రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు. పట్టణీకరణ నేపథ్యంలో అపార్టుమెంట్ల సంస్కృతి పెరిగిన తరువాత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు నానాటికి కనుమరుగవుతున్నాయని అన్నారు. ఈ పోటీలలో దేవారెడ్డి విజయలక్ష్మి, వాణిసాంబశివరావు విజేతలను ఎంపిక చేశారు. ఈ పోటీలలో 75 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా నాయకురాళ్ళు విజయలక్ష్మి, సుశీల, నాగలక్ష్మి, సత్యవాణి, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు రవి, విజయేందర్ రెడ్డి, బాలరాజు, వెంకటేశ్వర్లు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, శివమామరెడ్డి, పాలం శ్రీను, M.S. రావు తదితరులు పాల్గొన్నారు.






