నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండలం చందానగర్ రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఆక్రమణ దారులపై దారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జనంకోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగం రాజశేఖర్‌లు రాజేంద్రనగర్ ఆర్‌డీఓ చంద్రకళారెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. రాజీవ్ గృహ కల్ప సముదాయంలో మొత్తం 2624 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టగా అందులోంచి 2582 మాత్రమే లబ్ధిదారులకు కేటాయించారని మిగిలిన 42 ఫ్లాట్లను స్థానిక మాఫియా, కబ్జాదారులు ఆక్రమించుకొని, అద్దెలకు ఇచ్చి లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను తమ ఆదీనంలో ఉంచుకుని చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భాస్కర్‌రెడ్డి ఆర్డీఓను కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హౌసింగ్ ఈఈ, ఎమ్మార్వో, కమీషనర్ జీహెచ్ఎంసీ, జోనల్ కమీషనర్, డిప్యూటీ కమీషనర్ లకు సైతం ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు.