నమస్తే శేరిలింగంపల్లి: ఆలిండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటి (ఏఐకేఎస్‌సీసీ) పిలుపు మేరకు మియాపూర్ ఎంఏనగర్‌లోని ఎంసీపీఐయూ కార్యాలయం ఆవరణలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పలు రైతుచట్టాలు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎంసీపీఐయూ, ఏఐకేఎఫ్, ఏఐసీటీయూ, ఏఐఎఫ్‌డీడబ్ల్యూ నాయకులు జీవో కాపిలను తగుల బెట్టారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయూ గ్రేటర్ కార్యదర్శి తుకారాం నాయక్ మాట్లాడుతూ దాదాపు 7 నెలల నుండి రైతు కార్మిక ప్రజా వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నా, లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో చలిని, ఎండను, వానను లెక్కచేయకుండా పాలకులు కల్పించిన ఎన్నో ఆటంకాలకు నిర్భంద్దలకు అరెస్టులకు, అక్రమకేసులకు, చలించకుండా ధర్నాలు తగిన గుణపాఠం చేప్పాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్మకాస్తూ ప్రజల బ్రతుకుల్ని పీల్చి పిప్పి చేస్తున్న ఈ పాలకులకు ప్రజా ఉద్యమ సెగ చూయించాలని, వారి పాలనకు చరమ గీతం పాడేవరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీటీయూ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్, ఏఐఎఫ్‌డీడబ్ల్యూ డివిజన్ నాయకురాలు సుల్తానా బేగం, టి. పుష్ప, రజియా బేగం, ఏఐకేఎఫ్ నాయకులు మల్లేష్, నర్సింహా, రాజు తదితరులు పాల్గొన్నారు.
