నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగులోని అటవి కళాశాలలో రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారంలో ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంబిపూర్ రాజు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణ రావు, వివేకానంద గౌడ్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మానస పుత్రిక అయిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రాష్ట్రమంతా మొక్కలు నాటడం అభినందనీయమని అన్నారు. ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జోగినపల్లి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం గా నిలిచారని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు నాడు విధిగా ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలను నాటి వదిలివేయకుండా వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకొని తల్లి పిల్లను పెంచి పోషించినట్టు మొక్కను వట వృక్షంలాగా పెంచి పోషించాలని అన్నారు. ప్రతి ఒక్కరు మొక్కల ఆవశ్యకతను తెలుసుకొని మొక్కలను పెంచడంలో శ్రద్ద చూపించాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ఎంపి సంతోష్‌కుమార్‌తో కలసి మొక్కలు నాటడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు.
