క‌రోనా వైద్యంకు ప్ర‌భుత్వ ధ‌ర‌ల‌కు మించి చార్జీలు వ‌సూలు చేస్తే చ‌ర్య‌లు… ప్రైవేట్ హాస్పిట‌ల్స్ దోపిడిపై మండిప‌డ్డ గాంధీ…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: క‌రోనా వైద్యం పేరుతో ప్రైవేట్ హాస్పిట‌ల్స్ అధిక ఫీజులు వసూలు చేయ‌డంపై ప్ర‌భుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అసహనం వ్యక్తం చేశారు. పేద‌ప్ర‌జ‌ల నుంచి శ‌క్తికి మించి అడ్డ‌గోలుగా డ‌బ్బ‌లు దండుకుంటున్న‌ట్టు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్థుత‌ విపత్కర పరిస్థితుల్లో మానవత్వం మరచిపోయి, ధనదాహంతో కరోనా వైద్యం పేరుతో రోగి కుటుంబాన్ని భయబ్రాంతులకు గురి చేసి అధిక బిల్లులు వసూలు చేయడం దారుణ‌మ‌ని అన్నారు. కొన్ని హాస్పిట‌ల్స్‌లో రోగి మృతిచెందినా, వారి ఆర్ధిక ప‌రిస్థితి బాగా లేకున్న పెద్ద‌ మొత్తంలో డ‌బ్బులు డిమాండ్ చేస్తూ పార్ధీవ దేహాల‌ను ఇవ్వ‌డం లేద‌ని అన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిట‌ల్స్ యాజ‌మాన్యాలు వైద్య వృత్తికి కళంకం తీసుకురావడం మంచి ప‌రిణామం కాద‌ని గాంధీ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కొరకు ఆసుపత్రికి వస్తే అవ‌కాశ‌నం ఉన్నా వారిని తిరిగి పంపియడం భావ్యం కాదని, కనీసం ప్రాథమిక వైద్యం కూడా చేయకపోవడం శోచనీయమ‌ని అన్నారు. ప్ర‌భుత్వ రేట్‌కార్డుకు మించి క‌రోనా వైద్యానికి అధిక చార్జీలు వ‌సూలు చేస్తే యాజమాన్యాల పై కఠినమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని, వైద్యాధికారులకు, జిల్లా కలెక్టర్‌కు పిర్యాదు చేయడం జరుగుతుంద‌ని అన్నారు. ప్రైవేట్‌ ఆసుప‌త్రుల‌ ధనదాహానికి పేద , మధ్యతరగతి కుటుంబాలు బ‌ల‌వుతున్నాయ‌ని, ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగుల నుంచి 10, 15, 18, 22 లక్షల రూపాయలువ‌సూలు చేసిన సంద‌ర్భాలు త‌న దృష్టికి వ‌చ్చాయ‌ని అన్నారు. బెడ్‌ ఛార్జ్ 30 వేలు, ఆక్సిజన్ 8 నుంచి 10 వేలు, పీపీఈ కిట్స్ 7 వేలు, ఇతరత్రా ఖర్చులతో క‌లిపి ఒక్క రోజుకు ల‌క్షరూపాల‌కు పైగా బిల్లులు వ‌సూలు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని అన్నారు. ఇప్ప‌టికైనా ప్రైవేట్ హాస్పిట‌ల్స్ యాజ‌మాన్యాలు త‌మ‌వైక‌రి మార్చుకోవాల‌ని, ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌ల ప్ర‌కార‌మే చార్జీలు వ‌సూలు చేయాల‌ని సూచించారు. కాద‌ని అడ్డ‌గోలు వ‌సూళ్ల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

ప్ర‌భుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఫార్మ‌సీల‌పై డ్ర‌గ్ ఇన్‌స్పెక్ట‌ర్లు ప్ర‌త్యేక దృష్టి సారించాలి…

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మెడికల్ షాపులు, ప్రైవేట్ హాస్పిట‌ల్స్‌లోని పార్మ‌సీల్లో డ్రగ్ ఇన్‌స్పెక్ట‌ర్ల‌ పర్యవేక్షణ ఎంతో అవసరం అని ప్రభుత్వ విప్ ఆరెకపూడి సూచించారు. మెడికల్ షాప్‌ల‌లో మందుల విక్రయాలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా పెట్టాలని, క‌రోనా రోగుల‌కు అవసరమైన మందులు మెడికల్ షాప్‌ల‌లో లభించే విదంగా జాగ్ర‌త్తలు తీసుకోవాల‌న్నారు. నిర్ణిత రేట్లకు మాత్రమే మందులు లభించేలా చూడలని, అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేసే కిమిస్ట్‌ల‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్ర‌స్థుత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో శ‌క్తికి మించి డ‌బ్బులు చెల్లించ లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న నిరుపేద, మ‌ధ్య‌త‌ర‌గ‌తి రోగుల‌కు అండ‌గా నిల‌వాల‌ని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here