నమస్తే శేరిలింగంపల్లి: రాఖీపౌర్ణమి సమీపిస్తున్న నేపథ్యంలో పోస్టల్ శాఖ కొత్త సేవకు శ్రీకారం చుట్టింది. ప్రత్యక్షంగా వెళ్లి సోదరులకు రాఖీ కట్టలేని పరిస్థితుల్లో ఉండే సోదరీమణులకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ-షాప్ ద్వారా రాఖీ బుక్ చేసుకుంటే దేశంలోని ఏ చోటుకైనా రాఖీని చేరవేస్తుంది పోస్టల్ శాఖ. ఇందుకోసం ప్రత్యేకంగా, ఆకర్షనీయంగా రూపొందించిన రక్షబంధన్ ఎన్వొలప్ కవర్, ప్రత్యేక గ్రీటింగ్ కార్డును తెలంగాణ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాజేంద్రకుమార్ గురువారం నగరంలోని ఢాక్‌సదన్‌లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెబ్‌సైట్ www.eshop.tsposts.inలో పలు రకాల రాఖీలను అందుబాటులో ఉంచామని అన్నారు. ఆన్‌లైన్‌లో రూ.100 చెల్లించి బుక్ చేసుకున్న వారికి స్పీడ్‌పోస్ట్ ద్వారా రాఖీతో పాటు ఒక చక్కటి సందేశంతో కూడిన గ్రీటింగ్ కార్డును సూచించిన గమ్యానికి చేరవేస్తామని అన్నారు. ఈ నెల 22న రాఖీపౌర్ణమి పర్వదినం నేపథ్యంలో సోదరులకు దూరంగా ఉండే సుదూర ప్రాంతల సోదరీమణులు, అదేవిధంగా కరోనా కారణంగా పుట్టింటికి చేరుకోలేక పోతున్న అక్కలు, చెల్లెల్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజేంద్రకుమార్ పిలుపునిచ్చారు.